హైదరాబాద్ గన్ పార్క్ వద్ద హైటెన్షన్..
హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆయన అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించడానికి బీజేపీ కార్యాలయం నుంచి కాలినడకన బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు.
ఇక అక్కడి నుంచి గన్ పార్క్ కు చేరుకున్న బండి సంజయ్ అధికార బీఆర్ఎస్ పై మండిపడ్డారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అలాగే మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలనీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ దీక్ష నేపథ్యంలో గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బండి సంజయ్ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసులు గో బ్యాక్.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.
దీక్షా స్థలిని వదిలి వెళ్లాలని..ప్రజలు ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నారని పోలీసులు చెప్పగా..తాము ప్రశాంతంగా దీక్ష చేస్తున్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కార్యకర్తలను బలవంతంగా తరలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బండి హెచ్చరించారు. నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్న కేసీఆర్ పాలన ‘‘ఇక సాలు దొర సెలవు దొర’’ అంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బండి సంజయ్ దీక్షను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీస్ వాహనాన్ని బీజేపీ శ్రేణులు చుట్టుముట్టారు. దీనితో ఓ బీజేపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు. ఈ దీక్షలో పాల్గొన్న బండి సంజయ్ ను, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సహా పలువురు నాయకులూ, కార్యకర్తలను పోలీసులు గన్ పార్క్ వద్ద అరెస్ట్ చేశారు.