భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఞండ్ హైకోర్టు నూతన భవనాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్‌కి కృతజ్ఞతలు తెలపడంతోపాటు ఆయనను ప్రశంసించారు. తీర్పులు అందరికీ అర్థమయ్యే భాషల్లోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. చట్టం, భాష అందరినీ కలుపుకునేలా ఉండాలని, దీంతో కేసుకు సంబంధించిన పార్టీలతో పాటు ఆసక్తి కలిగిన పౌరులు న్యాయవ్యవస్థలో భాగస్వాములవుతారని అన్నారు. ఇతర న్యాయమూర్తులు ఇదే విధానాన్ని పాటించాలని అభ్యర్థించారు. కోర్టుల్లో ఇంగ్లీషు ప్రాథమిక భాషగా ఉండటంతో.. చాలామంది ప్రజలు ఆ ప్రక్రియను అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులను పలు భారతీయ భాషల్లో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని ప్రారంభిస్తూ సుప్రీంకోర్టు విలువైన ముందడుగు వేసిందని అన్నారు. ఇతర న్యాయస్థానాలూ ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయని చెప్పారు. జార్ఞండ్ వంటి భాషా వైవిధ్యం ఉన్న రాష్ట్రంలోనూ ఈ విధానం మరింత సులభతరమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక నిర్దిష్ట కేసులో తమకు న్యాయం జరగాలని వచ్చిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సిజెఐ డివై.చంద్రచూడ్ అన్నారు.