ఓ జంట పెండ్లి చేసుకుని వస్తుండగా, వారిని ఓ 15 మంది వ్యక్తులు వెంబడించారు. ఆ జంటను అడ్డగించి, పెండ్లి కూతురును తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం అర్ధరాత్రి వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ జంట కొండగట్టులో వివాహం చేసుకుని కారులో బయల్దేరారు. వారి కారును మరో కారు వెంబడించింది.
15 మంది గుర్తు తెలియని వ్యక్తులు.. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఆ జంట కారును అడ్డగించారు. అనంతరం నవ వధువును బలవంతంగా లాక్కెళ్లి.. తమ కారులో తీసుకెళ్లిపోయారు. ఇదే సమయంలో వరుడిపై కొందరు దాడి చేశారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు వరుడు పోలీసు స్టేషన్ వైపు పరుగులు పెట్టాడు. వధువు, వరుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.