తెలంగాణకు అతి త్వరలోనే మరో వందే భారత్ రైలు రానుంది. ఇప్పటికే రెండు ట్రైన్లు సికింద్రాబాద్ మీదుగా నడుస్తుండగా.. మరొక వందే భారత్ ట్రైన్ కోసం భారతీయ రైల్వే పని చేస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ వరకు నడవనున్నట్లు సమాచారం. సాధారణంగానే హైదరాబాద్- నాగ్‌పుర్ మధ్య బాగా ట్రాఫిక్ ఉంటుంది. నిత్యం లక్షలాది మంది ఈ రూట్లలో ప్రయాణిస్తుంటారు.
ఇంకా ఈ రెండు మార్గాల మధ్య వాణిజ్యం కూడా బాగానే నడుస్తుంది. ఈ మార్గంలో ప్రస్తుతం 25కుపైగా రైలు సర్వీసులు నడుస్తున్నప్పటికీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో లేవు. ఇంకా నాగ్‌పుర్- సికింద్రాబాద్ మధ్య దూరం 581 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉన్న రైళ్లలో దీని కోసం 10 గంటలకుపైగా పడుతుండగా.. వందే భారత్ ట్రైన్‌తో ఈ సమయం చాలా తగ్గనుంది. 6 గంటల 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.