పరస్పర విశ్వాసం, గౌరవం అనేవి భారత్-ఆస్ట్రేలియా సంబంధాలకు బలమైన, అతి పెద్దవైన పునాదులని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వ్యాఖ్యానించారు. పైగా దీని వెనుక గల అసలైన కారణం ఇక్కడ గల ప్రవాస భారతీయులని పేర్కొన్నారు. సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఏరియాలో కమ్యూనిటీ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూఈ వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియావ్యాప్తంగా 21వేల మందికి పైగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను నిర్వచించాలంటే మూడు సి లు ఉపయోగించాలని, అవి ‘కామన్‌వెల్త్, క్రికెట్, కర్రీ’ అని అన్నారు.
ఆ తర్వాత మూడు డి ల గురించి మాట్లాడుకోవాలన్నారు. అవి డెమోక్రసీ (ప్రజాస్వామ్యం), డయాస్పోరా (ప్రవాసులు), దోస్తీ (స్నేహం) అని చెప్పారు. ఆ తర్వాత మూడు ఇ ల గురించి చెప్పుకోవాలన్నారు. అవి, ఎనర్జీ (ఇంధనం), ఎకానమీ (ఆర్థిక వ్యవస్థ), ఎడ్యుకేషన్ (విద్య) అన్నారు. అయితే వాస్తవానికి ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న కూలంకష సంబంధాలు ఈ సి, డి, ఇలన్నింటినీ అధిగమించాయని మోడీ పేర్కొన్నారు. మోడీ మాట్లాడుతుంటే సభలో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య భౌగోళికంగా దూరాలు వున్నా హిందూ మహా సముద్రం కలుపుతోందని అన్నారు.
రెండు దేశాల్లోని జీవనవిధానం ఎంత భిన్నంగా వున్నా, యోగా మనల్ని కలుపుతోంది, క్రికెట్ కూడా కొంత మేరకు కలిపి వుంచుతోంది. ఇక టెన్నిస్, చిత్రాలు ఇవన్నీ మనలను కలిపివుంచే కొన్ని వంతెనలని మోడీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానం మెరుగ్గా వుందని ఐఎంఎఫ్ పరిగణిస్తోందని అన్నారు. ప్రస్తుతం వీస్తున్న అంతర్జాతీయ పవనాలను తట్టుకుని నిలబడిన దేశం ఏది అంటే భారత్ అని ప్రపంచ బ్యాంక్ పేర్కొంటోందన్నారు. అత్యంత సవాలుగా నిలిచిన పరిస్థితుల్లో కూడా భారత్ రికార్డు స్థాయిలో ఎగుమతులు సాధించిందన్నారు. ఇక్కడి ప్రవాస భారతీయుల సుదీర్ఘ కాల డిమాండ్ అయిన బ్రిస్బేన్‌లో కాన్సులేట్‌నను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సిడ్నీ శివార్లలో లిటిల్ ఇండియాకు శంకు స్థాపన చేయడంలో ఆస్ట్రేలియా మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.