ఈనెల 20న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఢిల్లీలోనే ఉన్న ఆమె అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. కాగా ఇదే కేసులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా నోటీసులు పంపింది ఈడీ. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పిళ్లై కస్టడీ పొడిగింపు..
రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు . ఎమ్మెల్సీ కవితతో కలిపి పిళ్లైను విచారించాల్సిన అవసరం ఉందని ఈడీ తరపున కోర్టులొ వాదనలు విన్పించారు. లిక్కర్ స్కాంలో పిళ్లైని గత 10 రోజులగా విచారించింది ఈడీ.