AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విమానంలో మరోసారి మూత్ర విసర్జన ఘటన

న్యూయార్క్‌– న్యూఢిల్లీ అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఘటన

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ‘75 ఏళ్ల పెద్దావిడపై ఓ తాగుబోతు మూత్రవిసర్జన’ చేసిన రీతిలోనే మరో ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్‌– న్యూఢిల్లీ అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ పురుష ప్యాసింజర్‌పై సహ ప్యాసింజర్‌ మూత్రం పోశాడు. మద్యం మత్తు, ఆపై నిద్రమత్తులో ఈ పనికి పాల్పడినట్టు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ , ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఫ్లైట్‌ నంబర్‌ ఎఎ 292లో ఈ ఘటన జరిగిందని తెలిపాయి. కాగా గత శుక్రవారం రాత్రి 9:16 గంటలకు న్యూయార్క్‌లో టేకాఫ్‌ తీసుకున్న ఈ విమానం 14 గంటల 26 నిమిషాల ప్రయాణం తర్వాత శనివారం రాత్రి 10:12 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయ్యిందని అధికారులు చెప్పారు.

మూత్రవిసర్జనకు పాల్పడిన నిందితుడు ఒక విద్యార్థి అని, యూఎస్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, నిద్రమత్తులో మూత్రవిసర్జనకు పాల్పడ్డాడని పేర్కొన్నాయి. నిందిత ప్యాసింజర్‌ క్షమాపణలు చెప్పడంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత ప్యాసింజర్‌ సుముఖంగా లేడని ఓ అధికారి తెలిపారు. పోలీసు కేసు నమోదైతే తన కెరియర్‌పై దుష్ప్రభావం చూపుతుందని, ఫిర్యాదు చేయవద్దంటూ నిందిత ప్యాసింజర్‌ బతిమాలుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

కాగా మూత్రవిసర్జన వ్యవహారాన్ని బాధిత ప్యాసింజర్‌ విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు పైలెట్‌కు రిపోర్ట్‌ చేశారు. పైలెట్‌ వెనువెంటనే ఏటీసీకి సమాచారం అందించాడు. ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులను అతడు అప్రమత్తం చేశాడు. దీంతో ఎయిర్‌లైన్స్‌ సొంత సెక్యూరిటీతోపాటు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు రంగంలోకి దిగారని, విమానం ల్యాండయ్యిన వెంటనే నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారని తెలిపారు. కాగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ప్యాసింజర్‌ విమానంలో దుష్ప్రర్తన పాల్పడితే విమానంలో ప్రయాణించకుండా నిషేధంతోపాటు క్రిమినల్‌ చట్టాల కింద చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10