AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీలో, రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..

కవిత అరెస్ట్ ఖాయమా..?
న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదికైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరు కానుండటంతో హస్తిన కేంద్రంగా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత సోదరుడు మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్ రావు కూడా ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తున్నారు.

గురువారం ఉదయం 11 గంటలకు కవితను ఈడీ విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ఈడీ ఎదుట హాజరు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 11న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను తొలిసారి విచారించింది. దాదాపు 9 గంటల పాటు కవిత విచారణ సాగింది. ఇక.. కవితకు సంబంధించిన ఇవాల్టి ఈడీ విచారణ విషయానికొస్తే.. అరుణ్‌ పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించాలని ఈడీ డిసైడ్ అయింది. నేడు బుచ్చిబాబును కూడా ఈడీ విచారణకు పిలిచింది. ఇదే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తీవ్రమైన బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న చందన్‌రెడ్డిని క్రూరంగా కొట్టారని, దాంతో ఆయన వినికిడి శక్తి కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై చందన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని, ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించారు. తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా సాక్షులను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని, కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ భయపెడుతున్నారని తెలిపారు.

కేంద్రంలోని అధికార పార్టీ ఇష్టం ప్రకారం ఈడీ తనకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని, తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధించడమే కాకుండా వాటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలొని ధర్మాసనం ఎదుట న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే తక్షణమే స్టే విధించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ చేపడతామని తెలిపింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10