ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణ బాక్సర్లు పతక పంచ్ లు విసురుతున్నారు. మొన్న మహిళల బాక్సింగ్ లో నిఖత్ జరీన్ స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. తాజాగా పురుషుల బాక్సింగ్ లో మహ్మద్ హుసాముద్దీన్ కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు. తాష్కెంట్ లో జరుగుతున్న మెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తన పంచ్ పవర్ చూపెట్టాడు.
వరుస విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో పోటీ పడ్డ మొదటి ప్రయత్నంలోనే హుసామ్ పతకం గెలవడం విశేషం. అతనితోపాటు భారత బాక్సర్లు దీపక్‌భోరియా, నిశాంత్‌దేవ్ కూడా సెమీస్ చేరడంతో భారత్ కు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయం అయ్యాయి. సెమీస్ లో ఓడిన బాక్సర్లకు కాంస్యం లభిస్తుంది. ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఎడిషన్ లో అత్యధికంగా మూడు పతకాలు రానుండటం భారత్ కు ఇదే తొలిసారి. 57 కిలోల కేటగిరీ క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 4–3తో ఐదో సీడ్ దియాజ్ ఇబనేజ్ (బల్గేరియా)పై ఉత్కంఠ విజయం సాదించాడు. హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపెట్టాడు. ఇబనేజ్‌పై బలమైన పంచ్‌లు విసిరాడు. ఇక సెమీస్‌లో అతను క్యూబాకు చెందిన సైడెల్ హొర్టాతో పోటీ పడతాడు. 51 కిలోల క్వార్టర్ ఫైనల్లో దీపక్ 5–0తో నుర్జిట్ (కిర్గిస్తాన్)ను చిత్తు చేశాడు. 71 కిలోల క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ సైతం 5–0తో క్యూబాకు చెందిన జార్జ్ క్యుయెలర్‌ను నాకౌట్ చేశాడు.