పేదల భూములను మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పేదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడి చేస్తుందని ఫైర్ అయ్యారు.పీపుల్ మార్చ్ లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలోని మీర్ పేట్,బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు ఇండ్లు ఇవ్వకపోవడమే కాకుండా గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను ప్రభుత్వం గుంజుకుందని.. ఇది పేదల పట్ల జరుగుతున్న అతిపెద్ద కుట్ర అని తెలిపారు.
బీఆర్ఎస్ రాజ్యహింసపై మేధావులు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని.. అధికార యంత్రాంగం, న్యాయస్థానాలు, మీడియా, సామాజిక బాధ్యత ఉన్న రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.