ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. అన్నం వండలేదని భార్యను కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని సాంబల్‌పూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సాంబల్‌పూర్ జిల్లా జమన్‌కిరా పోలీసు స్టేషన్ పరిధిలోని నౌధి గ్రామానికి చెందిన సనాతన్ ధరువా(40) తన భార్య పుష్ప ధరువా(35), కుమారుడు, కూతురితో కలిసి ఉంటున్నాడు. అయితే సనాతన్ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య కూర వండింది కానీ అన్నం వండలేదు.
దీంతో ఆకలితో ఉన్న భర్త ఆగ్రహాంతో భార్యపై ఊగిపోయాడు. ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో.. భార్యపై దాడి చేసి కొట్టి చంపాడు. కుమారుడు ఇంటికి వచ్చి చూడగా, తల్లి విగతజీవిగా పడిపోయింది. దీంతో కుమారుడు పోలీసులకు, బంధువులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్యను చంపిన సనాతన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.