హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. లీకేజీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక భేటీ నిర్వహించింది. సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీపై కమిషన్ చర్చిస్తోంది. ఏఈ పరీక్ష రద్దు చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ వన్ పరీక్షపై వస్తున్న అనుమానాలను కమిషన్ పరిశీలిస్తోంది. ప్రవీణ్ ఎగ్జామ్ సమయంలో వ్యవహరించిన తీరు, అతడి పేపర్‌పై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పరీక్షా పేపర్ లీకేజీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. కమిషన్ సమావేశం అనంతరం మీడియా ప్రకటన విడుదలకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ సమావేశం తరువాత సీఎస్‌తో బోర్డ్‌ల సమావేశం జరుగనుంది.