ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించామన్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలు, టైం టేబుల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే ఫెయిలైన విద్యార్థులను వారి తల్లిదండ్రులు దగ్గరకు తీసుకొని భరోసా కల్పించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆవేశాలకు లోను కావొద్దని, మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావాలని సూచించారు. విద్యార్థులకు తల్లిదండ్రులు బాసటగా నిలిచి, వారిలో మనో ధైర్యాన్ని అందించాలన్నారు.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.