హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో ఇతర రాజకీయ పార్టీలు, పౌర సామాజిక సంస్థలతో కలిసి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఢిల్లీలోని ఓ హోటల్లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ సమావేశం ఉండనున్నట్లు ఆమె మంగళవారం తెలిపారు. ఈ సమావేశాన్ని భారత్ జాగృతి సంస్థ నిర్వహిస్తుంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమె ఇదివరకే మార్చి 10న ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈడి విచారణను నుంచి దృష్టి మళ్లించడానికే కవిత నిరాహారదీక్ష చేపట్టారని బిజెపి, కాంగ్రెస్ ఆరోపించాయి. కె.కవిత ఇప్పటికే మార్చి 11న తన వాంగ్మూలాన్ని ఈడి ముందు ఇచ్చింది. ఆమెను ఈడి తొమ్మిది గంటలపాటు ప్రశ్నించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని, మనీలాండరింగ్ జరిగిందని ఈడి నేరారోపణ చేసింది. ఇదిలావుండగా కవితను మార్చి 16న కూడా విచారించేందుకు ఈడి సమన్లు ఇచ్చిందని అధికారులు తెలిపారు.