తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరీక్షలకు మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే పరీక్షల నేపథ్యంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా సెంటర్‌లోకి అనుమతిచ్చేది లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1473 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,82,677 కాగా, సెకండ్ ఇయర్ 4,65,022 మంది ఉన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసి బస్సు ఆపేలా సూచనలిచ్చామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటామని, అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఎలాంటి మానసిక ఒత్తిడి అనిపించినా విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకోవాలి.. ప్రతీ విద్యార్థి మనో ధైర్యంతో ఉండాలని తెలిపారు.