జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.ఆర్మీలో ఆయన సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నారు. భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కిష్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అనిల్ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.అనిల్ మృతితో మల్కాపూర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అనిల్ 11 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఆయనకు సౌజన్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అయాన్, అరావ్ ఉన్నారు. నెల క్రితమే స్వగ్రామానికి వచ్చిన అనిల్ పది రోజుల క్రితమే తిరిగి వెళ్లి విధుల్లో చేరారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు యత్నించారు. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడిన ఆయన.. అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆదేశించారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతో పాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు. వీరజవాన్ భార్య, పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు.