సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను పిలవకపోవడంపై ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా..? పార్లమెంటు శంఖుస్థాపనకు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా అని ప్రశ్నించారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో గవర్నర్ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోదీ వందే భారత్ ట్రైన్ల ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలుస్తున్నారా ? అని సూటిగా ప్రశ్నించారు. మహిళా గవర్నర్ గా తమిళిసై పై తమకు గౌరవం ఉంటుందని కానీ గవర్నర్ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పోదెం వీరయ్య వినతిపత్రం ఇచ్చారనే కారణంతో..గవర్నర్ భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపారని, ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉంటుందా అని అడిగారు.
వైద్యశాఖలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఆపారని, ఆ బిల్లులో అభ్యంతరకరమైన అంశాలు ఏమి ఉన్నాయని అడిగారు. అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏండ్లకు పదవీ విరమణ పెంచారని.. వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ గవర్నర్ కు ఎందుకు అని అడిగారు. 70 ఏండ్లకు పదవి విరమణ వయసును పెంచవచ్చని నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ లోనూ స్పష్టం ఉందని చెప్పారు. డాక్టర్ అయ్యుండి తమిళి సై ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా అని ప్రశ్నించారు.ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు రాష్ట్రం జాబితాలో మరికొన్ని అంశాలు ఉంటాయని, వాటికి అనుగుణంగా బిల్లులు ఉన్నాయా లేదా అని చూడటం వరకే గవర్నర్ బాధ్యత అని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు ఉంటే గవర్నర్ బిల్లులు ఆపొచ్చు అని.. ప్రభుత్వం పెట్టిన బిల్లుల్లో అలాంటివేమి లేవన్నారు.బీజేపీ కనుసన్నల్లోనే గవర్నర్ పని చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని, గవర్నర్ కు రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బీజేపీలో చేరి పోటీ చేయొచ్చని సూచించారు.