AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదు: రేవంత్ రెడ్డి

ఓఆర్ఆర్ అంశంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖా మంత్రిపై ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఇరుక్కుపోతాననే భయంతో కేటీఆర్ ముఖం చాటేశారని ఆరోపించారు. హైదరాబాద్ లోని తన నివాసంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మం ఏమిటి?అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్లు చేతులు మారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మాజర్ సంస్థ నివేదిక ప్రకారం టెండర్లు ఇచ్చామని సమర్థించుకుంటున్నారని తెలిపారు. మాజర్ సంస్థపై అమెరికాలో కేసులు నమోదయ్యాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉండేదని, IRBకి అప్పగించేందుకు ఓఆర్ఆర్ ను HMDA పరిధిలోకి తీసుకొచ్చారని అన్నారు. దీని వెనక గూడుపుఠానీ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటామన్న కేసీఆర్.. తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు ప్రైవేటుకు కట్టబెడుతున్నారని నిలదీశారు. NHAI నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వలేదని, బేస్ ప్రైస్ నిర్ణయించకుండా ఎవరైనా టెండర్ పిలుస్తారా? అని ప్రశ్నించారు. టోల్ గెట్ పై రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వస్తుందని, ఏడాదికి రూ.730 కోట్లు, 30 ఏళ్లకు రూ. 22వేల కోట్లు ఆదాయం వస్తుందని, రూ.16 వేల కోట్లు బ్యాంకు రుణం వస్తుందని.. కానీ ప్రభుత్వం తక్కువ ధరకే ప్రైవేటుకు కట్టబెట్టిందన్నారు. IRB ని ముందు పెట్టి.. వెనుక కేటీఆర్ బినామీ కంపెనీలతో ఇందులోకి ప్రవేశించే కుట్ర జరుగుతోందన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదని, తెలంగాణ ఆస్తుల్ని కేసీఆర్ ప్రైవేటుకు అమ్మడానికి వీల్లేదని, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అరవింద్ కుమార్ పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డీవోపీటీకు కంప్లైంట్ చేస్తామని చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10