హాజరు శాతం లేకపోయినా పరీక్షలు రాసే అవకాశం.
ఇంటర్మీడియట్‌లో సరిపడా హాజరు శాతం లేక పరీక్షలకు హాజరుకాలేకపోతున్న వారు ఎందరో ఉన్నారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యలు, మరే కారణంతోనైనా అకడమిక్ ఇయర్‌లో కళాశాలలకు వెళ్లలేక పోయిన విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. హాజరు శాతం తక్కువగా ఉన్నా పరీక్షలు రాసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అవకాశం కేవలం ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు మాత్రమే.
రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లకుండానే ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారికి తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డ్ తెలిపింది. అనివార్య కారణాలతో కాలేజీకి రాలేకపోయిన వారితో పాటు ఇతర పనులు చేసుకుంటూ ఇంటర్ చదువుకోవాలనుకునే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
రూ. 500తో పాటు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలు రాసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇలాంటి విద్యార్థులు మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్ లేదా 040-24600110 నంబర్‌కు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.