అతగాడు చదివింది పన్నెండు. కానీ సైబర్ నేరాల్లో మాత్రం దిట్టం. మహిళలే అతడి మెయిన్ టార్గెట్. దేశ వ్యాప్తంగా వేల మందిని మోసం చేశాడు. అతడి మోసాల చిట్టా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రోజుకు రూ. 5 కోట్ల లావాదేవీలు చేస్తాడు మరి. ఎంత పెద్ద నేరగాడైనా ఎప్పుడో ఓసారి దొరకాల్సిందే కదా. అలా ఈసారి మనోడు దొరికిపోయాడు. హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ కేటుగాని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. దాడి శ్రీనివాసరావు (49) అనే వ్యక్తి పన్నెండో తరగతి వరకే చదివినా.. సైబర్ నేరాల్లో మాత్రం దిట్ట. అతడి మోసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే రోజుకు రూ.5 కోట్లకు పైగానే బ్యాంకు లావాదేవీలు జరుగుతాయి. ఇతడి మోసానికి వేల మంది బలైపోయారు. దేశ వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అతడు ఉన్నట్లు తెలుసుకున్న ముంబై పోలీసులు అరేస్టు చేశారు. శ్రీనివాసరావుతో పాటు ముఠాలోని మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు కోల్‌కతాకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు ఠాణెకు చెందిన వారిగా గుర్తించారు.
మహిళలే టార్గెట్..
శ్రీనివాసరావు ఎక్కువగా మహిళలను టార్గెట్ చేసి సైబర్ మోసాలకు పాల్పడేవాడు. పోలీసు అధికారులమంటూ వారికి ఫోన్ చేసి.. మీరు పంపిన కొరియర్‌లో డ్రగ్స్ లేదా వెపన్స్ దొరికాయని బెదిరించేవాడు. కొరియర్ మీది కాదని నిరూపించుకోవాలంటే బ్యాంకు డీటెయిల్స్ పంపాలని అమాయకులను ఆదేశించేవాడు. వాటిని తనిఖీ చేసి ఆ కొరియర్‌తో మీకు సంబంధం ఉందో లేదో తేలుస్తామని నమ్మించేవాడు. దీంతో భయభ్రాంతులకు గురై చాలామంది వారు అడిగిన వివరాలను ఇచ్చేవారు. అతడికి ఓటీపీని కూడా చెప్పేవారు. ఎనీ డెస్క్ లాంటి యాప్‌లను ఉపయోగించి అమాయకుల ఖాతాలను కొల్లగొట్టేవారు.
రోజుకు రూ.5 నుంచి రూ.10 కోట్లు
ఇలా దేశవ్యాప్తంగా వేలమంది నుంచి రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు లావాదేవీలు జరిపేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా దోచుకున్న డబ్బును దాడి శ్రీనివాస రావు పలు ఖాతాల్లోకి మళ్లించేవాడు. బ్యాంకు ఖాతాల్లోకి చేరిన డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మారుస్తున్నట్లు తెలిసింది. ఆ క్రిప్టో మొత్తాలను ఓ చైనా జాతీయుడి ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి శ్రీనివాసరావు లావాదేవీలు జరుపుతున్న 40 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.