AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్..

6 ఫైళ్లపై సంతకం..
తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం తూర్పు గేటు నుంచి కేసీఆర్ సచివాలయం లోపలికి చేరుకున్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో కేసీఆర్‌ను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. అనంతరం కేసీఆర్ వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.

కొత్త ఛాంబర్‌లోకి ప్రవేశించిన కేసీఆర్‌కు పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, అధికారులు బొకేలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి కేసీఆర్ కాళ్లకు నమస్కారాలు చేశారు. అనంతరం సచివాలయం మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో కేసీఆర్ పూజలు చేస్తున్నారు. అటు మంత్రులు కూడా తమ కేటాయించిన కొత్త ఛాంబర్లలోకి ప్రవేశిస్తున్నారు. కొత్త చాంబర్లలోకి వచ్చిన సందర్భంగా మంత్రులకు అధికారులు అభినందనలు తెలిపారు.

మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి తమ ఛాంబర్లలో కొలువుదీరారు. ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా కేటీఆర్ తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాల ఫైల్‌పై కేటీఆర్ తొలి సంతకం చేశారు. తెలంగాణ ప్రాథమిక పాఠశాల టీచర్లకు ట్యాబ్‌లు అందించే ఫైల్‌పై మంత్రి సబితా తొలి సంతకం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైల్‌పై కేసీఆర్ తొలి సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి హరీష్ తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు అంటూ హరీష్ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10