AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నూతన సెక్రటేరియేట్​ విశేషాలివిగో…

సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర నూతన పరిపాలన సౌధం ప్రారంభం కానున్న సందర్భంగా దాని విశేషాలేంటో తెలుసుకుందాం…సెక్రటేరియట్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి ప్రత్యేక పర్యవేక్షణ సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. నిత్యం సుమారు 650 మంది భద్రతా సిబ్బంది పహారా విధుల్లో ఉంటారు. పటిష్టమైన సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకుల ఫేస్ రికగ్నిషన్ ద్వారా సమాచారం అప్పటికప్పుడు ఆధార్ డేటాతో అనుసంధానం అవుతుంది. ఏదైనా తేడా కొడితే వారి సందర్శనను నిలిపేస్తారు.

ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ రక్షణ
ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుదీరే ఆరో అంతస్తుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఫ్లోర్ మొత్తం 1.85 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఇందులో 53వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం ఛాంబర్ ఉంటుంది. సీఎం ఛాంబర్ తో పాటు సందర్శకులతో జరిగే మీటింగ్ హాల్ ను బుల్లెట్ ఫ్రూఫ్ గా తయారు చేశారు. అన్ని వైపుల నుంచి ప్రొటెక్షన్ కవర్ అయ్యేలా ఇంటెలిజెన్స్ అధికారుల సూచన మేరకు దీనిని నిర్మించారు. సీఎం కోసం ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్ లతో పాటు ప్రత్యేక లిఫ్టులను కూడా ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయ్ నేరుగా లిఫ్ట్ దగ్గరకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

ఆరో అంతస్తులో ‘జనహిత’
ప్రజాదర్బారు నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఆరో అంతస్తులో ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి అతిథులతో కలిసి భోజనం చేసేందుకు అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.

నలువైపులా ద్వారాలు

సచివాలయం నాలుగు దికుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో నార్త్‌వెస్ట్‌ (వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడే తెరుస్తారు.
నార్త్‌ఈస్ట్‌ (ఈశాన్య) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్‌ఈస్ట్‌ (ఆగ్నేయం) ద్వారం విజిటర్స్‌ కోసం వినియోగిస్తారు.
తూర్పుగేట్‌ (మెయిన్‌గేట్‌) ముఖ్యమంత్రి, సీఎస్‌, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్‌ బగ్గీలను ఏర్పాటుచేస్తారు.

విస్తీర్ణం: 28 ఎకరాలు
నిర్మాణ విస్తీర్ణం: 10,51,676 చదరపు అడుగులు
ఎత్తు: 265 అడుగుల ఎత్తు
గుమ్మటాలు: ప్రధాన గుమ్మటాలు రెండు, చిన్న గుమ్మటాలు 34
ప్రధాన గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నాల ఏర్పాటు
అంతస్తులు: జీ ప్లస్ 6

ఎవరెక్కడ..

సీఎం ఛాంబర్: ఆరో అంతస్తులో
కేబినెట్ మీటింగ్స్ హాల్: ఆరో అంతస్తులో..
2 నుంచి 5వ అంతస్తు వరకు : 16 మంది మంత్రుల ఆఫీసులు
1,2 అంతస్తుల్లో : సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ ఆఫీసులు
3 నుంచి 5వ : అంతస్తుల్లో ఇతర శాఖల ఆఫీసులు, మంత్రుల కార్యాలయాలు
గ్రౌండ్‌ ఫ్లోర్‌ : సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్‌ తదితరాలు

పార్కింగ్

సుమారు 2.5 ఎకరాల్లో అధికారులు, సిబ్బందికి సంబంధించి 560 కార్లు, 720 బైక్ లు, నాలుగు బస్సులను ఏకకాలంలో పార్క్ చేసే వీలుంటుంది. 300 కార్లు పట్టే 1.5 ఎకరాల స్థలాన్ని సందర్శకుల వాహనాల కోసం కేటాయించారు. (సాధారణ రోజుల్లో 700 నుంచి 800 మంది, అసెంబ్లీ సెషన్స్ టైం లో వెయ్యి మంది వరకు సెక్రటేరియట్ కు వస్తారని అంచనా). సీఎం, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ఉంటుంది. ఉన్నతాధికారులు, సందర్శకులు, సిబ్బంది వాహనాలకు వేరే స్థలం ఉండనుంది.

పచ్చదనం.. ఫౌంటేన్లు
మొత్తం 8 ఎకరాల స్థలాన్ని పచ్చదనానికి కేటాయించారు. ఇందులో ప్రధాన ద్వారం వద్ద ఆరెకరాలు.. లోపలి వైపు మరో రెండు ఎకరాల్లో గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో (28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వైశాల్యం) సచివాలయంలో ముందు భాగంలో రెడ్‌శాండ్‌ స్టోన్‌తో రెండు ఫౌంటేన్లను కూడా ఏర్పాటుచేశారు.

నిర్మాణం సాగిందిలా…

2019 జూన్ 27న సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేశారు
పనులు ప్రారంభమైన తేదీ: జనవరి, 2021
పనిచేసిన కార్మికులు: మూడు షిప్టుల్లో 12 వేల మంది కార్మికులు పనిచేశారు.

వాడిన నిర్మాణ సామగ్రి

ఇనుము: 7,000 టన్నులు
సిమెంటు: 35,000 టన్నులు
ఇసుక: 26,000 టన్నులు
కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు
ఇటుకలు: 11 లక్షలు
గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు
మార్బుల్: లక్ష చదరపు లడుగులు
ధోల్ పూర్ రెడ్ స్టోన్: 3,500 ఘనపు మీటర్లు
కలప: 7,500 ఘనపుటడుగులు

బాహుబలి ద్వారం, 875 తలుపులు

29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో బాహుబలి మహాద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్​ జిల్లాలోని అడవుల నుంచి సేకరించిన టేకు కలపను వినియోగించి మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈ మహాద్వారాన్ని తయారుచేయించారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో 875 కి పైగా తలుపులుండగా అన్నింటినీ టేకుతోనే తయారు చేశారు.

నిర్మాణ శైలి
చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని అనే ఆర్కిటెక్ట్ సంస్థ దక్కన్​ కాకతీయ శైలిలో సచివాలయ నిర్మాణానికి డిజైన్ రూపొందించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయం, సారంగపూర్ హనుమాన్ ఆలయాలను, వనపర్తిలోని ప్యాలెస్ ను నమూనా రెఫరెన్సుగా తీసుకున్నది. సెక్రటేరియట్ పైన నిర్మించిన గుమ్మటాలు బోధన్ లోని వంద స్తంభాల గుడిని పోలి ఉంటాయి. తెలంగాణ నిర్మాణ శైలిని సచివాలయానికి అనుసంధానిస్తున్నట్టు ఆర్కిటెక్ట్ వివరించారు. వందశాతం వాస్తు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ భవనాన్ని నిర్మించారు. సీఎం కేసీఆర్ కు వాస్తు సలహాదారుగా ఉన్న సుద్దాల సుధాకర్ తేజతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాతే ఫైనల్ చేసినట్టు ఆర్కిటెక్ట్ చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10