సూడాన్ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయుల్లో కొందరికి దురదృష్టవశాత్తూ ఎల్లో ఫీవర్ సోకినట్టు బయటపడింది. ఆపరేషన్ కావేరీలో భాగంగా ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో, అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌లో పెట్టారు.
దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి బారిన పడ్డ వారిలో కళ్లు, చర్మం ఆకుపచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, వాంతులు తదితర సమస్యలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరితే అంతర్గత రక్తస్రావం జరిగిని అవయవాలు పనిచేయడం మానేసి చివరకు మరణం సంభవించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటివరకూ సుడాన్‌లో చిక్కుకుపోయిన 1,725 మంది ‘ఆపరేషన్ కావేరి’ ద్వారా సురక్షితంగా భారత్‌కు చేర్చామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. శనివారం మరో 365 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని వెల్లడించారు.