‘మక్కల్ నీదిమయ్యం’ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్(Kamal Haasan) కాంగ్రెస్‌కు మద్దతుగా శాసనసభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఆయన మే మొదటివారంలో కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఎంఎన్ఎం నేతలు తెలిపారు. కమల్ ప్రచార పర్యాటన వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. రాహుల్ జోడోయాత్ర నిర్వహించినప్పుడు కమల్ ఢిల్లీలో ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు.
ప్రస్తుతం కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేయనున్నారు. ఈ అంశాలను పరిశీలిస్తే వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ నీదిమయ్యం కాంగ్రె్‌సతో పొత్తు కుదుర్చుకోవటం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచనలపై గత రెండు రోజులుగా కమల్ కోయంబత్తూరు, సేలం జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులతో సమావేశమై చర్చించారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైతే పార్టీ నాయకుడు కమల్‌హాసన్ కోయంబత్తూరు(Coimbatore) లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయాలని పార్టీ నిర్వాహకులు కోరారు. 2021 శాసనసభ ఎన్నికల్లో కమల్‌హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.