వరంగల్: బీఆర్‌ఎస్ పెద్దల ఒత్తిడితో జానకీపురం సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిరింది. తనపై లైంగిక ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్యకు ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు చెప్పారు. పార్టీ పెద్దల ఒత్తిడితో ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ ఇంటికి వెళ్లారు. సర్పంచ్ దంపతులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘‘ మానసిక క్షోభకు గురిచేసుంటే క్షమించాలి. తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించాలి. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా. నేను తప్పుచేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలి. అందరూ కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించింది’’ అని మీడియా సాక్షిగా రాజయ్య క్షమాపణలు చెప్పారు.
వెధవలు ఇప్పటికైనా మారాలి: సర్పంచ్ నవ్య
తాను మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనని సర్పంచ్ నవ్య మరోసారి చెప్పారు. ‘‘ నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. మహిళలపై అరాచకాలను ప్రశ్నించాలి. మహిళలను ఎవరైన వేధిస్తే భరతం పడతా. సమాజంలో మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు గౌరవం ఇవ్వాలి. తప్పు చేసినట్లు ఒప్పుకుంటే ఎవరినైనా క్షమిస్తా. మళ్లీ అదే తప్పు చేస్తే ఊరుకోను. మహిళలను వేధించే వెధవలు ఇప్పటికైనా మారాలి’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాటికొండ రాజయ్య తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఎం చేస్తారో మీడియా ముఖంగా చెప్పాలని నవ్య పట్టుబట్టారు.