హైదరాబాద్: సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ఆమెకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. శోభ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి కేసీఆర్ తెలుసుకుంటున్నారు.
అంతకుముందు ప్రగతిభవన్‌లో కవితతో కేసీఆర్ భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఈడీ విచారణ, ఈ నెల 16న జరగనున్న విచారణ గురించి చర్చించారు. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొన్నారు. నిన్నటి ఈడీ విచారణ జరిగిన తీరు గురించి కవిత ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ జరిగిన తీరు గురించి కేసీఆర్‌కు కవిత సుదీర్ఘంగా వివరించారు. అనంతరం ఈ నెల 16న జరగనున్న విచారణ గురించి పలు అంశాలు చర్చించారు. విచారణలో ఎలా వ్యవహరించాలనే దానిపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం ప్రగతిభవన్ నుంచి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం మరోసారి కవితతో కేసీఆర్ భేటీ కానున్నారు. రెండోసారి ఈడీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో.. భవిష్యత్తు పరిణామాలపై చర్చించనున్నారు.