మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన మహిళా సర్పంచ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే తనపై మనసు పడ్డాడంటూ.. ఆయన చెప్పినట్టు చేయాలంటూ సొంత పార్టీ నేతలే వేధింపులకు గురి చేస్తున్నట్టు మీడియా ముందు ఆరోపించారు. అయితే.. ఎమ్మెల్యే తరచూ ఫోన్ చేసి మాట్లాడు అంటూ వేధించేవాడని తెలిపారు. ఓ మహిళ ప్రజాప్రతినిధి ద్వారా రాయభారం పంపారని.. ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలని ఆమె ఒత్తిడి తెచ్చేదనన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలని.. ఆన మాట వింటేనే సహకారం ఉంటుందని.. లేకుంటే సహకారం అస్సలే ఉండదని బెదిరించినట్టు వివరించారు. వారు ఎంత వేధించినా తాను తిరస్కరించినట్టు తెలిపారు. సహకారం లేకున్నా ఫర్వాలేదు కానీ ఒకరి చేతుల్లో ఉండే మనిషిని తాను కాదంటూ స్పష్టం చేశారు.
‘‘ఎమ్మెల్యేను కలిసినప్పుడు భర్తలు పక్కన ఉండకూడదట. సమావేశాలలో ఫోటోలు దిగేటప్పుడు దగ్గరగా అతుక్కున్నట్టు నిలబడాలి. నేను నిలబడను అంటే ఎమ్మెల్యే ఓర్వడు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నీవు బొమ్మవా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినావ్. ఎంజాయ్ చేయవా అంటూ ఎమ్మెల్యే అనేవాడు. నేను మా ఎమ్మెల్యేను ఓ తండ్రిలా చూశాను. కానీ.. ఆయన నన్ను కూతురిలా కాకుండా ఇలా చూడటం చాలా బాధాకరం. మా ఎమ్మెల్యే, ఓ మహిళా నేత, మరో అగ్రవర్ణ నాయకుడి వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. మాలో ఎవ్వరికి చిన్న గాయమైనా వారిదే బాధ్యత. మాకు రక్షణ కల్పించాలి. కేసీఆర్, కేటీఆర్కు విన్నవించేది ఒక్కటే.. ఆ ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో టికెట్టు ఇవ్వకూడదు.’’ అంటూ మహిళా సర్పంచ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.