దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క స్పందించారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశంలో వ్యాపారవేత్త అదానీ, ప్రధాని మోదీ మాత్రమే ఉండాలని బీజేపీ పార్టీ చూస్తోందని ఆరోపించారు. ప్రతి పౌరుడి సమానత్వం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. మనుధర్మ శాస్త్రంను బీజేపీ పాటిస్తుందని ఫైర్ అయ్యారు. కుల, మత, ధనిక అంతరాలను సూచించే మనుధర్మ శాస్త్రాన్ని బీజేపీ అనుసరిస్తుందని వెల్లడించారు.
అంబేడ్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే.. అంబేడ్కర్‌ను అవమానించడమేనని ఆరోపించారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాలకు దేవుడు అంబేడ్కర్ అని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని తొలగించాలనే బీజేపీ కుట్ర అమిత్ షా వ్యాఖ్యలతో మరోసారి బయటపడిందన్నారు. అంబేడ్కర్ ఔనత్యాన్ని చాటింది నెహ్రూ అని, గాంధీ కుటుంబం పార్టీ అంటున్న మోడీ.. మూడు సార్లు సీఎంగా, మూడు సార్లు పీఏంగా ఎందుకు ఉన్నారని అన్నారు. అంబేడ్కర్ పేరు లేకుండా చేసే కుట్ర చేస్తుందని, భవిష్యత్‌లో ఓకే ఎన్నిక, ఓకే పార్టీ, ఒకే వ్యక్తి అనే కుట్రకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు.