సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ నటుడు అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన చిక్కడపల్లి పోలీసులు.. స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. సంధ్య థియేటర్ ఘటనపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే మంగళవారం అల్లు అర్జున్ విచారణ కొనసాగింది. థియేటర్‌లో తొక్కిసలాట ఘటనతోపాటు అతర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరిపినట్లు సమాచారం.
పోలీసుల ప్రశ్నలతో అల్లు అర్జున్ కన్ఫ్యూజన్..
కొన్ని ప్రశ్నల విషయంలో అల్లు అర్జున్ షాక్ అయినట్లు సమాచారం. తనకు పోలీసులు రేవతి చనిపోయిన విషయాన్ని డిసెంబర్ 4వ తేదీ రాత్రి చెప్పలేదని మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చెప్పగా.. నేరుగా అల్లు అర్జున్‌కు రేవతి మరణ వార్త తెలియజేశానని చెబుతున్న ఏసీపీ రమేష్.. బన్నిని ప్రశ్నించడంతో ఆయన షాక్‌కు గురైనట్లు సమాచారం. మొదట అల్లు అర్జున్ విచారణకు హాజరుకాగానే ఎలా ఉన్నావ్ అని పలకరించిన పోలీసులు తరువాత తమ ప్రశ్నలతో బన్నిని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ తో పాటు లీగల్ టీమ్, అల్లు అరవింద్, చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. వాళ్లు ఒక గదిలో కూర్చోగా.. మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు.
సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీసులు..
అల్లు అర్జున్ బెయిల్ రద్దు విషయాన్ని పోలీస్ శాఖ ïసీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తోంది. అందుకే సీసీటీవీ ఫుటేజీ, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోందట విచారణ బృందం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది.
జరిగింది ఇదీ..
ఈనెల 4న రాత్రి 9.30 ప్రాంతంలో సంధ్య థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసింది. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించి పలు వీడియోలు బయటపెట్టారు. అయితే అంతకుముందు రోజు అల్లు అర్జున్ కూడా ప్రెస్‌మీట్ నిర్వహించి తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. ఘటన జరిగినట్లు తర్వాతి రోజు తెలిసిందని.. ఆ వార్త విని కుంగిపోయానన్నాడు అల్లు అర్జున్ .
సీరియస్ యాక్షన్..
అయితే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్ యాక్షన్‌కు దిగుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్‌ను మరోసారి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. అయితే, ఏయే అంశాలపై స్టేట్‌మెంట్ రికార్డు చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇదివరకే∙మధ్యంతర బెయిల్‌పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్ ఛాన్స్ లేదు. కానీ, బెయిల్ రద్దుపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రత్యేకించి బెయిల్ రూల్స్‌కు విరుద్ధంగా అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టారనేది పోలీసుల వాదన. అంతేకాదు, సంధ్య థియేటర్‌కి వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలను వీడియోలను బయటపెట్టారు. ఇక ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. పోలీసుల వీడియో ఆధారంగానే అల్లు అర్జున్‌పై ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఔట్‌పుట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నేరం రుజువైతే.. పదేళ్ల జైలే..
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్‌పై పెట్టిన కేసులో కోర్టులో సాక్ష్యాలు రుజువైతే పదేళ్ల పాటు జైలు శిక్ష తప్పదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. సహజంగా యాక్సిడెంట్స్ కేసుల్లో 304 ఏ అనే కేసులు పెడుతుంటారన్నారు. కానీ అల్లు అర్జున్‌పైన పోలీసులు పెట్టిన కేసులు ఏమిటంటే.. తను వస్తే భారీగా జనసందోహం రావచ్చునని, ఆ రద్దీలో ఒక వేళ ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలు పోవచ్చునని తనకు తెలుసునని, అది తెలిసి కూడా అల్లు అర్జున్ సంధ్య థియుటర్‌కు వచ్చినట్లు ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
అల్లు అర్జున్‌ను పోలీసులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఇవేనని ప్రచారం సాగుతోంది.. అందులో కొన్ని.. ఇలా..
1. సంధ్య థియేటర్‌కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు?
2. పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు?
3. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా.. లేదా?
4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?
5. మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు?
6. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
7. అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు?
8. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
9. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?
10. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
11. అభిమానులు, పోలీసుల మీద దాడిచేసిన బౌన్సర్లు ఎవరు?
12. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా?
13. పోలీసులు చెప్పినా.. వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు?
14. రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు? వంటి ప్రశ్నలు అడినట్లు ప్రచారం జరుగుతోంది.