ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురి అరెస్ట్
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మొదట అల్లు అర్జున్ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్య పరీక్షలు ముగిశాక నాంపల్లి కోర్టుకు తరలించారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా –2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు.
ఆ ముగ్గురికి రిమాండ్
పుష్ప2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ తెలిపారు. సంధ్య థియేటర్ మొత్తం ఏడుగురు యజమానుల్లో సందీప్ ఒకరని చెప్పారు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్‌ని కోర్టులో హాజరు పరిచామని అన్నారు. వారిని జ్యూడిషల్ రిమాండ్‌కు తరలించామని అన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉందని అన్నారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారు. లీగల్ టీంను సంప్రదించి తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్ కు కూడా నోటీసులు ఇస్తామని ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
సమాచారం ఇవ్వలేదు.. డీసీపీ అక్షాంశ్ యాదవ్
కాగా.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి 9.40 గంటల సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని.. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని తెలిపారు. ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న సమాచారం తమకు లేదని తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఆ సమాచారం చెప్పలేదని పేర్కొన్నారు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలిపారు. పబ్లిక్‌ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.
ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు..
మరోవైపు ‘పుష్ప–2’ సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ )కు ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై దర్యాప్తు జరపనుంది.