అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రపంచమంతా పాకటంతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. ఇప్పటికే నేషనల్ అవార్డుతో పాటు పలు గుర్తింపులు సాధించాడు. తాజాగా అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం సాధించాడు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. గత అక్టోబర్ లో మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి కొలతలు తీసుకున్నారు. ఈ విగ్రహాన్ని దుబాయ్ లోని మ్యూజియం లో ఏర్పాటు చేసారు. నిన్న మార్చి 28 రాత్రి అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఓపెనింగ్ చేసారు. ఈ విగ్రహం అలవైకుంఠపురంలో కాస్ట్యూమ్ తో పుష్ప మేనరిజంతో ఉంది.
బన్నీ ఈ మైనపు విగ్రహంతో సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తగ్గేదేలే.. అంటూ కామెంట్ చేసాడు. అలాగే తన మైనపు విగ్రహం ఓపెనింగ్ వీడియోని కూడా పోస్ట్ చేసారు. ఇక అల్లు అర్జున్ తో పాటు ఫ్యామిలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ప్రస్తుతం మైనపు విగ్రహంతో అల్లు అర్జున్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు బన్నీకి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక అభిమానులైతే గర్వంతో సంతోషిస్తున్నారు.
అయితే ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఆ రెండు విగ్రహాలు లండన్ లోని మ్యూజియంలో ఉండగా అల్లు అర్జున్ ది మాత్రం దుబాయ్ లో ఏర్పాటు చేసారు.