అల్లు అర్జున్ విడుదలపై సస్పెన్స్ కు తెరపడింది. బన్నీ శనివారం ఉదయం జైలు నుంచి విడుదల కానున్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీ.. చంచల్ గూడ జైలు అధికారులకు అందింది. కాగా, బన్నీ ఈ రాత్రికి(శుక్రవారం) చంచల్ గూడ జైల్లోనే ఉండనున్నాడు. జైల్లోని మంజీరా బ్యారక్ లో బన్నీ ఉన్నాడు. అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి 7 లేదా 8 గంటలకే జైలు నుంచి విడుదల అవుతాడని అంతా భావించారు. కానీ, బెయిల్ ఆర్డర్ కాపీ ఆన్ లైన్ లో అప్ లోడ్ కావడం ఆలస్యమైంది.
హైకోర్టు మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీ ఆన్ లైన్ లో ఆలస్యంగా అప్ లోడ్ కావడం, ఆర్డర్ కాపీలో ఇవాళే విడుదల చేయాలని స్పష్టంగా లేకపోవడంతో బన్నీ రాత్రంతా చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బెయిల్ ఆర్డర్ కాపీ తమకు అందకపోవడంతో.. అల్లు అర్జున్ ను రిలీజ్ చేయడానికి జైలు అధికారులు ఒప్పుకోలేదు. తనకు అందిన సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ శనివారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అవుతాడని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదల కానున్నాడని జైలు అధికారులు చెప్పడంతో బన్నీ కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాత్రికి బన్నీ ఇంటికి తిరిగి వస్తాడని కుటుంబసభ్యులు ఎంతో ఆశగా చూడగా.. చివరికి నిరాశే మిగిలింది. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం లేదా రాత్రికి అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలవుతారని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి చంచల్ గూడ జైలు బయట బన్నీ కోసం ఎదురుచూసిన కుటుంబసభ్యులు, అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.