AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.2100 కోట్ల లంచం ఆరోపణ.. అమెరికాలో కేసు..

రూ.2100 కోట్ల లంచం, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం వంటి ఆరోపణలతో అదానీ గ్రూప్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను కొట్టిపారేసింది. తమపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధరమైనవని పేర్కొంది. అక్కడి చట్టాలకు లోబడి తమ గ్రూప్ నడుచుకుంటోందని స్పష్టం చేసింది. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

సోలార్ పవర్ ప్రాజెక్టులు పొందేందుకు అదానీ గ్రూప్ ఏకంగా రూ.2100 కోట్లు భారత అధికారులకు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ విషయంలో గౌతమ్ అదానీ సహా మరో 7 మందిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ వార్తలు వెలుగులోకి వచ్చిన క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ కుప్పకూలాయి. ఒక్కరోజులోనే లక్షల కోట్లు నష్టం వచ్చింది. రాజకీయంగానూ దుమారం రేగింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

తమపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన క్రమంలో అదానీ గ్రూప్ స్పందించింది. అవి నేరారోపణలు మాత్రమేమని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పాలనా వ్యవహారాల్లో, పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ ఉత్తమమైన ప్రమాణాలను పాటిస్తుందని నొక్కి చెప్పారు. తాము వ్యాపారం నిర్వహించే ప్రతి చోటా అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తామన్నారు. చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి అదానీ గ్రూప్ తమ వ్యాపార కార్యాకలాపాలు సాగిస్తుందన్నారు. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదని ఓ ప్రకటనలో అదానీ గ్రూప్ పేర్కొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10