అది ఒక శ్మశానవాటిక. చీకటి పడింది. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఓ నీడ కనిపిస్తోంది. ఆ వైపున వెళుతున్న ఓ వ్యక్తి, ఆ నీడను గమనించాడు. ఇంకేముంది గజగజ వణికిపోయాడు. స్థానికులకు అసలు విషయాన్ని తెలిపి, అక్కడికి వచ్చి ఒకే ఒక్క లుక్ వేశారు. అంతే హడలెత్తిపోయారు. ఇంతకు అక్కడ ఉన్నది ఎవరో తెలుసా లేడీ అఘోరీ మాత.
తెలంగాణకు చెందిన అఘోరీ మాత తెలియని వారు ఉంటారా.. అస్సలు ఉండరు కూడా. ఎందుకో తెలుసా ఈమె క్రేజ్ అటువంటిది. అతి తక్కువ కాలంలో సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం పొందిన అఘోరీ మాత, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారారు.
మొన్నటి వరకు ఏపీలో హల్చల్ చేసిన అఘోరీ మాత ఉన్నట్లుండి మంగళవారం నకరికల్లులో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆమెకు కాసేపు వాగ్వాదం సాగింది. అంతకు ముందు ఏపీలోని మంగళగిరి, ఇబ్రహీం పట్నం వద్ద అఘోరీ మాత రహదారిపై బైఠాయించిన విషయం తెలిసిందే. అలాగే ఇబ్రహీంపట్నం వద్ద రహదారిపై కారు అడ్డంగా నిలిపి, కారు లోనే పూజలు నిర్వహించగా పోలీసులు, స్థానికులు ఎట్టకేలకు అద్దాలు పగలగొట్టి అఘోరీ మాతను బయటకు తీశారు.
అక్కడి నుండి అఘోరీ మాత నకరికల్లు కు చేరుకోగా, అక్కడి నుండి పోలీసులు పంపించి వేశారు. అయితే ఉన్నట్లుండి మంగళవారం సాయంత్రం అఘోరీ మాత వరంగల్ లోని బెస్తం చెరువు స్మశాన వాటికలో ప్రత్యక్షమయ్యారు. ఆ స్మశాన వాటికలో పూజలు నిర్వహిస్తుండగా, స్థానికులు గమనించారు. శరీరానికి బూడిద పూసుకొని, ఆరిపోయిన చితిపై పడుకున్న అఘోరీ మాతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.