శ్రీహరికి ఇటు అభిమానులలోనూ .. అటు ఇండస్ట్రీలోనూ మంచి పేరు ఉండేది. శ్రీహరి చనిపోయిన తరువాత, ఆయన భార్య శాంతి ఇంటికే పరిమితమయ్యారు. చాలా గ్యాప్ తరువాత ఆమె ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. శాంతి మాట్లాడుతూ .. “బావ చనిపోయిన తరువాత ఆ షాక్ నుంచి నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువగా మద్యం తీసుకుంటూ ఉండేదానిని. అలా రెండేళ్లు గడిచిపోయాయి” అని చెప్పారు.
“మద్రాస్ లో ఉన్న మా వాళ్లు, వాతావరణం మార్పు కోసం రమ్మని అంటే వెళ్లాము. అక్కడే నేను అనారోగ్యం బారిన పడ్డాను. లివర్ డ్యామేజ్ అయిందని డాక్టరు చెప్పడంతో కొంతకాలం పాటు హాస్పిటల్లోనే ఉన్నాము. ఆ సమయంలో నా పిల్లలు ఏడుస్తూ నా పక్కనే కూర్చున్నారు. నాన్న పోయాక మనలని ఎవరూ పట్టించుకోలేదు… నువ్వు కూడా పోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని పిల్లలు నన్ను అడిగారు. ఆ ఒక్కమాట నన్ను ఆలోచనలో పడేసింది” అని అన్నారు.
“నా తరువాత పిల్లలు అనాథలైపోతారనే భయంతో నేను జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను. శ్రీహరి ఉన్నప్పుడు ఆయన చుట్టూ కనిపించేవాళ్లలో ఎవరూ కూడా ఆ తరువాత కనిపించలేదు. శ్రీహరి తరఫు బంధువులను నేను దూరం పెట్టాననే మాటలో ఎంతమాత్రం నిజం లేదు. చిన్నబ్బాయి హీరోగా .. పెద్దబ్బాయి డైరెక్టర్ గా నిలదొక్కుకునే పనుల్లో ఉన్నారు” అని చెప్పారు.