త్యాగాలు, పోరాటాల చరిత్ర ఆదివాసీలది
ఆదివాసీల కోసం రూ. 17 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాం
ఆదివాసి దినోత్సవ సభలో మంత్రి సీతక్క
అమ్మన్యూస్, హైదరాబాద్ : గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని ఆదివాసీ భవన్ లో జరిగిన వేడుకల్లో మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మన హక్కుల్ని పోరాడి సాధించుకోవాలని చెప్పారు. చెంచుల జాతి అంతరించి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో ట్రైబల్ ఏరియాలో ఉద్యోగాలు రాలేదని, జీవో నెంబర్ 3 తీసేయడంతో ఉద్యోగాలు లేవని, అటవీ ప్రాంతంలో రోడ్లు కూడా గతి లేవని తెలిపారు. అడవులను కాపాడేది ఆదివాసి బిడ్డలేనని, తాము చెట్లు, పుట్టలను పూజిస్తామని అన్నారు. అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కి పర్మిషన్ ఇస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కొండ కోనల్లో వాగులు వంకల వద్ద నివసించే ఆదివాసులు హైదరాబాద్ వంటి నగరాల్లో తమ హక్కులపై చర్చించే స్థాయికి ఎదగడo అభినందనీయమన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పోరాటాలు, త్యాగాలు చేశారు కానీ ఆ జాతులు అభివృద్ధికి అంతగా నోచుకోలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసి గుడాలు సమగ్రాభివృద్ధి చెందినపుడే సమాజం అభివృద్ధి చెందినట్టవుతుందన్నారు. ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో మేధావులు నిర్ణయించాలని మంత్రి కోరారు. అధికారులు చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు తెలుసుకొని నివేదికలు అందజేస్తే నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అధికారులు మేధావులు ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే సమానత్వం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆదివాసి ప్రాంతాల్లో విద్యా, ఉద్యోగం వైద్యం, రవాణా, తాగునీరు వంటివి అందించే విధంగా పనిచేయాలని సూచించారు. గిరిజన ఆదివాసీలను అభివృద్ధి పథంలో నిలపాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రూ. 17 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించిందని గుర్తు చేశారు. బడ్జెట్ లో పెట్టిన ప్రతి రూపాయిని ఏజెన్సీ ప్రాంతాల్లో వెచ్చించి ఆదిమాజాతి ప్రజలను అభివృద్ధి పరుస్తామని మంత్రి పేర్కొన్నారు. అటవీ భూమి మీద ఆదివాసీలకు హక్కులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చిందని, కానీ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కి అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అడవిలో ఉన్న గ్రామాలకు మాత్రం రోడ్లు వేసేందుకు అనుమతులు పెట్టలేదన్నారు. కేంద్ర తీరు చాలా దురదృష్టకరంగా వుందని, ఇది భవిష్యత్ తరాలకు వినాశకరమని మంత్రి వ్యాఖ్యానించారు. అడవులను కాపాడింది ఆదివాసి బిడ్డలేనని, చెట్టును, పుట్టను ప్రకృతిని ఆరాధించే ఆదిమజాతితో అడవులు ఎప్పుడు నాశనం కావన్నారు.