సిట్టింగ్‌కు చెక్ పెట్టే ప్రయత్నాలు
టికెట్ ధీమాలో ఎంపీ సోయం
హాఫ్ సెంచరీకి చేరువైన ఆశావహుల సంఖ్య
వర్గపోరుతో అయోమయంలో క్యాడర్
హైకమాండ్ కు సైతం తలనొప్పిగా మారిన వ్వవహారం
అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కమలదళంలో నేతల మధ్య కయ్యాలు ముదురుతున్నాయి.ఎంపీ సోయం బాపురావు వర్సెస్ ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ నడమ కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే పార్టీలో లుకలుకలు మొదలుకావడంతో క్యాడర్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో అయోమయానికి గురవుతోంది. ఒకవైపు సిట్టింగ్‌కు సీటు రాకుండా కొందరు నేతలు ప్రయత్నిస్తుంటే ఇంకో వైపు ఈసారి కూడా తానే పోటీలో ఉంటానంటూ బాపురావు ఘంటాపథంగా చెప్పడం చర్చకు దారితీస్తోంది. మరోవైపు ఆశావాహుల సంఖ్య సైతం రోజురోజుకూ పెరగడంతో ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న సందిగ్ధం నెలకొంది. ఇటీవల మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సోయం బాపురావు మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా ఎంపీ సోయం బాపురావు గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో మరోసారి బీజేపీలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
నేతల మధ్య విబేధాలు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకుని మంచి జోష్ మీదున్న బీజేపీ అధిష్టానం వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకోక ముందే ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయని రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అందుకు ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ దఫా కూడా ఎలాగైనా తానే పోటీలో ఉండాలని సోయం భావిస్తుండగా ఆయనకు చెక్ పెట్టేందుకు పాయల్ శంకర్ వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని ఆశావహుల్ని బీజేపీలోకి రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినబడుతోంది. సోయం బాపురావుకు పోటీగా ఇతరులను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు శంకర్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్టు పార్టీవర్గాల్లో ప్రచారం జరగడం ఇందుకు ఊతమిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లోనూ అదే స్పష్టమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోయం కూడా టికెట్ దక్కించుకోవాలనే కృతనిశ్చయంతో తన ప్రయత్నాలలో తాను ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఢిల్లీ నేలతో ఆయన ఎప్పటికప్పడు టచ్‌లో ఉంటూ వారి మెప్పు పొందేందుకు చూస్తున్నారు. తన తెరవెనుక జరుగుతున్న పరిణామాలను అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. ఎంతమంది కొత్తవారు పార్టీలోకి వచ్చిన అధిష్టానం తనవైపు మొగ్గుచూపుతుందన్న సంకేతాలు ఇస్తున్నారు.
తన వారికోసం ప్రయత్నం
పార్టీలో కష్టపడి పనిచేసి సుధీర్ఘ కాలం తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందిన పాయల శంకర్ పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు చూస్తున్నారు. అందుకు తనకు అడ్డుగా ఉన్నవారిని తప్పించి అనుకూలంగా వ్యవహరించే వారికి పదవులు కట్టబెట్టాలని చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడి నియమాకం విషయంలో ఆయనే కీలకపాత్ర పోషించారన్న వాదన వినబడుతోంది. ఈ పదవీ కోసం ఎంతో మంది పోటీపడ్డప్పటికీ అనూహ్యంగా గుడిహత్నూర్ జడ్పీటీసీ పతంగె బ్రహ్మనంద్‌ను పార్టీ అధిష్టానం నియమించడం వెనుక పాయల శంకర్ హస్తం ఉందనే చర్చ సాగుతోంది. మళ్లీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీని సైతం తప్పిస్తే పార్టీపై పూర్తి పట్టు సాధించవచ్చనే ఆలోచనతోనే ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టుగా పార్టీ క్యాడర్‌లోనే గుసగుసలు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు…ఎమ్మెల్యే పాయల శంకర్‌కు గతం నుండి విభేదాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అందుకే ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఆయనకు పోటీగా బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి ఆశావహులను ఆయన తెరపైకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పార్టీలో చేరగా మరో ఆదివాసీ ముఖ్యనేతను సైతం పార్టీలోకి లాగేందుకు చూస్తున్నారని చర్చ సాగుతోంది. అయితే అధిష్టానం టికెట్ హామీ ఇవ్వకపోవడంతోనే సదరు నేత పార్టీలో చేరాలా..వద్దా అన్న మీమాంసాలో ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.
ఇదిలా ఉంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రమే కాకుండా ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని మిగతా మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి , రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబులు సైతం తమవారికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు రాథోడ్ రమేశ్ ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత ఈటల రాజేందర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఎంపీ టికెట్ తనకే దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎంపీ సోయంను ఇరకాటంలో పెట్టేందుకే ఇటీవల ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని బాపురావు తిప్పికొడుతూ పార్టీ మారే అవసరం తనకు ఏమాత్రమూ లేదని, లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తే తన తడాఖా చూపిస్తానని రమేష్ రాథోడ్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించడంతో నేతల మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థమవుతోంది. అంతేకాకుండా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలోనూ పాయల శంకర్, బాపురావుకు ఉన్న కోల్డ్ వార్ మరోసారి బహిర్గతమైంది. సంకల్ప యాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్యఅతిథిగా విచ్చేయగా అంబేద్కర్ చౌక్‌లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఆ సందర్భంగా అధ్యక్షత వహించిన పాయల శంకర్ అందరు నేతలతో మాట్లాడించి ఎంపీ బాపురావును మరిచిపోవడం, మైక్ ఇవ్వకుండా నేరుగా బండి సంజయ్ మాట్లాడతారని చెప్పడం, చివరకు ఆయన సైగలతో సర్దుకుని ఎంపీ సోయం బాపురావు ప్రసంగిస్తారని చెప్పడం వంటి పరిణామాలు చర్చకు దారితీశాయి.
పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
బీజేపీ నుండి టికెట్ దక్కితే విజయం తప్పకుండా వరిస్తుందన్న ధీమాతో చాలామంది ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టికెట్ రేసులో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మెన్ జనార్ధన్ రాథోడ్‌తోపాటు భైంసా మార్కెట్ కమిటీ చైర్మెన్ రాజేష్ బాబు, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన సినీ నటుడు అభినవ్ సర్దార్ కేతావత్, ఐఆర్ఎస్ అధికారి ప్రకాష్, రిమ్స్ డాక్టర్ సుమలత, ఆదివాసీ విద్యావంతురాలు డి.శ్రీలేఖ ఎంపీ బరిలో నిలిచేందుకు తహతహలాడుతున్నారు. తమదైన రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల ద్వారా పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. బీజేపీ అధిష్టాన పెద్దలతోనూ మంతనాలు జరుపుతున్నారు. తమకే టికెట్ కేటాయించాలంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే ఎంపీ టికెట్ ఎవరిని వరిస్తుందో మాత్రం ఇప్పడప్పుడే చెప్పలేని పరిస్థితి.
క్యాడర్ లో అయోమయం
అటు నేతల మధ్య సాగుతున్న కోల్డ్‌వార్‌తో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో నేతల మధ్య సఖ్యత లేకపోతే గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందనే చర్చ సాగుతోంది. అందరూ ఏకతాటిపై ఉండి క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే రాబోయే ఏ ఎన్నికలనైనా ధీటుగా ఎదుర్కోగలుగుతామని, లేదంటే బలహీనపడిపోయి పరాజయం పాలు కాక తప్పదనే అభిప్రాయాన్ని కార్యకర్తలు, కొందరు నాయకులు అధిష్టాన పెద్దల వద్ద వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టికెట్ ఎవరికీ వచ్చిన కలిసి పనిచేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించాలని నేతలకు క్యాడర్ విన్నవించుకుంటోంది. ఇలా అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసి క్యాడర్ విచ్చినానికి కారణం కావొద్దని సూత్రప్రాయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల వేడి రాజుకోకముందే పార్టీలో అంతర్గత విభేదాల పరిణామాలు రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తాయో చూడాలి.