ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాల కోసం భారత్‌లో రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని కేసు నమోదైంది. ఆ డబ్బు కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారన్నది కేసు సారాంశం.
దీనిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… స్కిల్ యూనివర్సిటీకి అదానీ విరాళం ఇచ్చారని, అసలు విరాళాలను కేటీఆర్ ఇచ్చినా తీసుకుంటామని అన్నారు.
అదానీకి తెలంగాణలో ఇంచు భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. నేరం రుజువైతే తాము చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటామని తెలిపారు. అదానీ అరెస్టయితే ప్రధాని రాజీనామా తప్పదని చెప్పారు. అదానీ ఆర్థిక నేరంలో మోదీకి భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.
అదానీని వెంటనే అరెస్టు చేయాలని, అదానీ అంశంలో జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ అరెస్టయితే అనేక అంశాలు బయటకి వస్తాయని తెలిపారు. అదానీ విషయంపై రాహుల్ గాంధీ ఎన్నిసార్లు మాట్లాడినా మోదీ కనీసం స్పందించలేదని చెప్పారు.