220 స్థానాలతో తిరుగులేని ఆధిక్యత
మహా రాజకీయాల్లో శరద్ పవార్ శకం ముగిసినట్లేనా?
కేవలం 13 స్థానాలకే పరిమితమైన ఎన్సీపీ వర్గం
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రభ మహారాష్ట్రలో క్రమంగా మసకబారుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన ఆయన ఎన్సీపీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ గతేడాది పార్టీని చీల్చి బీజేపీ పక్షాన చేరారు. దీంతో తాను ప్రారంభించిన పార్టీ తనకు కాకుండా పోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్కు రాజకీయాలు నడిపించాలని చూసిన ఆయనకును మరాఠా ప్రజలు పట్టించుకోలేదు. ఎంవీయే కూటమిలో భాగంగా 86 స్థానాల్లో పోటీచేసిన శరద్ పవార్ ఎన్సీపీ వర్గం కేవలం 13 సీట్లకు పరిమితమైంది.
ఇక ఎన్టీయే కూటమిలో ఉన్న అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో బరిలో నిలిచి 37 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. బారామతి నుంచి పోటీచేసిన అజిత్ తన సోదరుని కుమారుడు, ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి యుగేంద్ర పవార్‌పై ఘన విజయం సాధించారు. దీంతో బాబాయ్‌పై తనదే పైచేయి అని మరోసారి నిరూపించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న శరద్ పవార్.. ఇకపై మరాఠా ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతారనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, అజిత్‌ను తట్టుకుని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే పార్టీని నిలబెట్టగలుగుతారా అని సర్వత్రా చర్చ సాగుతున్నది.
ఇక, అధికారం కోసం శివసేన, ఎన్సీపీలను చీల్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అంతా అనుకున్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చేదు. మరోసారి ఎన్డీయే కూటమికే మరాఠీలు పట్టం కట్టారు. 220 స్థానాలతో తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. దీంతో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. బీజేపీకి 126 స్థానాలు రాగా, శివసేన (శిండే)కు 55, ఎన్సీపీకి 38 సీట్లు వచ్చాయి.