AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బులంద్‌షహర్‌ సమీపంలో బస్సు, టెంపో వ్యాను ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో 10 మంది మరణించగా… పలువురి గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు రక్షాబంధన్‌ పండుగ కోసం సొంతూరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తున్నవారు రక్షాబంధన్ జరుపుకోవడానికి తమ స్వస్థలం అలీగఢ్‌కు మాక్స్ వ్యాన్‌లో బయలుదేరారు. వారు ఇంటికి చేరుకునేలోపే బులంద్‌షహర్‌లోని సేలంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో షికార్‌పూర్ నుంచి ప్రయాణికులతో వస్తోన్న ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడకక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఒకరు ప్రాణాలు విడిచారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్టు బులంద్‌షహర్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ ధ్రువీకరించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వారి సహాయంతో క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కోసం తరలించిన పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ప్రమాదంపై ఆగ్రహానికి గురైన ప్రజలు రోడ్డును దిగ్బంధించారు. టెంపో వాహనంలో దాదాపు 20-22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

మీరట్-బదౌనీ జాతీయ రహదారిపై షికార్‌పూర్ వైపు నుంచి వస్తోన్న ప్రయివేట్ ట్రావెల్స్ బ్సు సేలంపూర్ గ్రామం ముందు ఓవర్‌టేక్ చేసే క్రమంలో టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన పికప్ వ్యాన్ పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులోని ఉన్న ప్రయాణికులంతా గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ఘటనకు కారకుడైన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10