రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక అడుగు పడింది. హైదరాబాద్ ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. నాలుగు లేన్ల ఎక్స్ ప్రెస్ వే కోసం టెండర్స్ పిలిచింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు పనులు జరగనున్నాయి. మొత్తం నాలుగు భాగాలుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకు గానూ రూ. 5 వేల 555 కోట్ల పనుల కోసం టెండర్లను పిలవగా, రెండు సంవత్సరాల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. సంగారెడ్డి జిల్లా గిర్మ్ పూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.5 కిలోమీటర్లు. రెడ్డిపల్లి గ్రామం నుండి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు. ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు వరకు రోడ్డు నిర్మించనుండగా.. మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఈమధ్యే దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.