పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని షంశీర్ గంజ్‌లో భారీ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలిపోయింది. ఆ చెట్టు ప్రధాన రహదారిపై విరిగి పడింది. దీంతో ఆ చెట్టు కింద పలు వాహనాలు ఇరుక్కుపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆలోపే స్థానికులు చెట్టు కొమ్మలను తొలగించి గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చెట్టు కూలడంతో షంశీర్ గంజ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు చెట్టును తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.