AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇద్దరు పిల‍్లలతో కలిసి చెరువులో దూకిన తండ్రి.. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన

తమ్ముడు డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో అఘాయిత్యం

తమ్ముడు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాలప్పడ్డాడు. ఎనిమిదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కూతురును నడుముకు చున్నీతో కట్టుకుని చెరువులో దూకాడు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు, తండ్రి మృతదేహాన్ని చెరువులో చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. వివరాలిలా ఉన్నాయి. చిన్నకోడూరు మండలం కస్తూరుపల్లికి చెందిన తేలు సత్యం (48)కు గతంలో వివాహం జరగగా భార్య అనారోగ్యంతో మరణించింది. 2016లో శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు అద్వేష్‌నంద (8), కూతురు త్రివేణి హాసిని (6) సంతానం. పట్టణంలోని నెహ్రూ పార్క్‌ వాసవీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యం స్థానికంగా ఓ ప్రింటింగ్‌ షాప్‌ నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఇటీవల సత్యంకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తమ్ముడి నుంచి రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలని తమ్ముడైన శ్రీనివాస్‌ను సత్యం అడిగాడు. ఇరవై రోజుల క్రితం తన డబ్బులు రూ.5లక్షల యాభై వేలు ఇవ్వాలని శ్రీనివాస్‌ను సత్యం అడిగాడు. దీంతో శ్రీనివాస్‌ తన అన్నను తిట్టి, చెప్పుతో కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించాడు. దీంతో సత్యం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సత్యం తన ఇద్దరు పిల్లలను పానీ పూరీ తినిపిస్తానని బయటకు తీసుకెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అంతా వెతికినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం పట్టణ శివారు చింతల చెరువు కట్టపైన సత్యం ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. చెరువులో ముగ్గురు మృతదేహాలు తేలి ఉండడాన్ని గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీయించారు.

చిన్నారుల మృతదేహాలను చూసి తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఎంతో సరాదాగా, చదువులో చురుకుగా ఉండేవారని అయ్యో పాపం మీరేమి పాపం చేశారు బిడ్డా.. అప్పుడే మీకు నిండు నూరేళ్లు నిండాయా అంటూ గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అక్కడ ఉన్న వారందరిని కంట తడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని సిద్దిపేట ఏసీపీ మధు, టూటౌన్‌ సీఐ ఉపేందర్‌ పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికీ తరలించారు. మృతుడు ఆత్మహాత్యకు ముందు తమ మరణానికి కారణాన్ని తెలుపుతూ తన సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియో, సూసైడ్‌ నోట్‌ను బైక్‌లో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భర్త, ఇద్దరు పిల్లల మరణానికి కారణమైన ప్రభుత్వ టీచరైన తన మరిది తేలు శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10