ఆయనో బాధ్యత గల పోలీసు ఉన్నతాధికారి. అన్యాయం జరిగిందని తమ దగ్గరకి వచ్చేవారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అటువంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఆ అధికారి ఆస్తుల కోసం కన్నతల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు. తన పలుకుబడితో వారికి నరకం చూపిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన సదరు పోలీసు అధికారి తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని ఆశ్రయించారు. కొడుకు వేధింపులు తట్టుకోలేకపోతున్నామని.. మీరే మమ్మల్ని రక్షించాలని డీజీపీ జితేందర్‌ను వేడుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్ రెడ్డి , బొజ్జమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రఘునాధ్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం కాగా.. అందర్ని కష్టపడి చదవించారు. పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి పోలీసు శాఖలో సీఐగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మల్టీ జోన్ 2లో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు యాదయ్య కూడా పోలీసు శాఖలోనే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కూతుళ్లు ఇద్దరికి పెళ్లిళ్లు చేశాడు.
అయితే రఘునాధ్ రెడ్డికి స్వగ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి విషయంలోనే కుటుంబంలో గొడవ మెుదలైంది. ఆస్తిని సమానంగా పంచితే పెద్ద కుమారుడికి 15 ఎకరాలు, చిన్న కుమారుడి 15 ఎకరాల భూమి రావాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా సీఐ నాగేశ్వర్ రెడ్డి తనకు 20 ఎకరాల భూమిని రాసివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తడి తీసుకొచ్చాడు. ఈ విషయంపై పలుమార్లు వారితో గొడవకు కూడా దిగాడు. దీంతో గ్రామంలోనే పెద్ద మనుషుల పంచాయితీ పెట్టారు. పంచాయితీ పెద్దలు పెద్ద కుమారుడికి 15 ఎకరాలు, చిన్న కుమారుడి పేరిట 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పు చెప్పారు. మిగిలిన భూమి వృద్ధ దంపతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి తదనతరం వారి కూతుళ్లకు ఇవ్వాలని తీర్పు చెప్పారు.
అందుకు చిన్న కుమారుడు యాదయ్య అంగీకరించినా.. పెద్ద కుమారుడు సీఐ నాగేశ్వర్ రెడ్డి మాత్రం ఒప్పుకోలేదు. తనకు 20 ఎకరాల భూమి రాసివ్వాల్సిందేనని.. తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. పలుమార్లు వారిని దూషించటంతో పాటు వారిపై దాడి కూడా చేశాడు. అన్న నాగేశ్వర్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక తమ్ముడు యాదయ్య ఓసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసాడు. ఈ నేపథ్యంలో కుమారుడి వేధింపులు తట్టుకోలేని తల్లిదండ్రులు డీజీపీని ఆశ్రయించారు. ఆస్తి కోసం తమను హింసిస్తున్నాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ ఫిర్యాదు చేసి కన్నీటి పర్యంతమయ్యారు.