బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. కాంగ్రెస్ పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇటీవల షాద్‌నగర్‌లో పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్థాన్‌కు వేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యతరం వ్యక్తంచేశారు. ఈ మేరుకు ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 188 సెక్షన్ కింద ఆమెపై కేసు నమోదుచేశారు.
గురువారం హైదరాబాద్‌లో లోక్‌సభ పరిధిలో నిర్వహించిన ప్రచారం సందర్భంగా కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. 15 నిముషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కానీ వాళ్లకు 15 నిముషాలేమో.. తమకు 15 సెకన్లు చాలు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.