వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
జర్నలిస్టు నిరవధిక సమ్మెకు మద్దతు
ఆదిలాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఫీుభావం తెలియజేశారు. తమ జీవితాలను త్యాగాలను చేసి ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సేవలను గుర్తించకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కార్‌కు జర్నలిస్టుల సంక్షేమం గుర్తుకురావడంలేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నారని, కానీ జర్నలిస్టులు గుంటెడు జాగా ఇవ్వడానికి మనస్సు ఒప్పడంలేదా అంటూ నిలదీశారు. పేదలు, జర్నలిస్టులకు దక్కాల్సిన భూములను బడా వ్యాపారులు, అధికార పార్టీ నేతలు అక్రమంగా ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి తాను అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.