హైదరాబాద్‌లో ఓ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఎడమ కాలికి బదులుగా కుడి కాలికి ఆపరేషన్ చేశాడు. దీంతో బాధితుడు వైద్యాశాఖలో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కరణ్ ఎం.పాటిల్ ఆర్థోపెడిషియన్. ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆయన నిర్వహిస్తన్నాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి మెకాళ్ల నొప్పులతో సర్జరీ కోసం డాక్టర్ కరణ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు.
పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కరణ్ అతడికి ఆపేరషన్ కోసం థియేటర్‌కు తరలించాడు. అయితే అతడికి ఎడమ కాలికి ఆపరేషన్ చేయాల్సిందిపోయి.. కుడి కాలికి సర్జరీ చేశాడు. తప్పదాన్ని రెండు రోజుల తర్వాత గుర్తించిన డాక్టర్ కరణ్.. తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్ చేశాడు. దీంతో బాధితుడు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఘటనపై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన వైద్యఉన్నతాధికారులు డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని నిర్ధరించారు.
అతడి గుర్తింపు రద్దుకు జిల్లా అధికారులు సిఫార్సు చేశారు. దీంతో డాక్టర్ కరణ్ గుర్తింపును రాష్ట్ర వైద్య మండలి రద్దు చేసింది. అతడి గుర్తింపును 6 నెలల పాటు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి వి. రాజలింగం ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఘటనలో రోగి మృతికి కారణమైన ప్రైవేటు డాక్టర్ గుర్తింపును కూడా వైద్యమండలి రద్దు చేసింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి డెంగ్యూతో ఆసుపత్రిలో చేరాడు. అయితే అతడిని సకాలంలో మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రి తరలించాలని ఆయన సిఫారసు చేయలేదు. దీంతో రోగి మృతి చెందారు. బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి డాక్టర్ శ్రీకాంత్ నిర్లక్ష్యాన్ని గుర్తించారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా అతడి గుర్తింపును 3 నెలల పాటు రద్దు చేశారు. గుర్తింపు రద్దయిన ఇద్దరు డాక్టర్లు తమ సర్టిఫికెట్‌లను రాష్ట్ర వైద్యమండలికి అందజేయాలని ఆదేశించారు.