AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రంగంలోకి ఈడీ..పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. విదేశాల్లో ఉన్న కొందరు వ్యక్తులకు పరీక్షకు ముందే గ్రూప్-1 పేపర్ అందిందని, వారు విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాశారనే అభియోగాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. పేపర్ లీక్ లో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఈడీ అధికారులు.. ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.

సిట్ బృందం సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మీపై.. ఈడీ ప్రధాన దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ భద్రతా అధికారిగా ఉన్న శంకర్ లక్ష్మీ కంప్యూటర్ నుంచే ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు శంకర్ లక్ష్మీతో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులిచ్చింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. కోర్టు అనుమతితో ప్రవీణ్, రాజశేఖర్ ని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. కాగా ఈ కేసులో కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారాయని ఆరోపిస్తూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ANN TOP 10