ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనతో (Delhi Blast) భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి, “ఆపరేషన్ సింధూర్” ఘటనల తర్వాత ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం ఇంకా చల్లారకముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పేలుడును ఉగ్రవాద చర్యగా పేర్కొంది, దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ భద్రతకు ముప్పు కలిగించే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తూ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, అఫ్గానిస్థాన్‌లతో యుద్ధానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో పాక్ తాలిబాన్ జరిపిన సూసైడ్ బ్లాస్ట్ ఘటనకు భారత్ మద్దతు ఉందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించడం ఈ పరిస్థితులను మరింత వేడెక్కించింది. దీనికి తోడుగా సోషల్ మీడియాలో “ఆపరేషన్ సింధూర్ 2.0” హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
గతంలో “ఆపరేషన్ సింధూర్” సమయంలో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే, ప్రస్తుతం అమెరికా ఆర్థిక, రాజకీయ సమస్యల్లో చిక్కుకుపోయినందున, ఈసారి దక్షిణాసియా ఉద్రిక్తతలపై దృష్టి సారించే అవకాశం తక్కువగా ఉందని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనివల్ల పాకిస్థాన్‌కు అమెరికా మద్దతు లభించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.








