ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో సెటైర్ వేశారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను ఉద్దేశిస్తూ, జగన్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్టు చేశారు. “చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న ‘క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుంది” అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
గత 18 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, దీనికోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా… గత వైయస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో, మంజూరు చేయించిన ఇళ్లను పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను చెబుతున్నారని జగన్ ఆరోపించారు. “ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారు” అంటూ జగన్ ఘాటుగా విమర్శించారు.
చంద్రబాబు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ఆయన ప్రభుత్వం ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదని జగన్ గణాంకాలతో సహా వివరించారు. ఆ ఇళ్లలో 1,40,010 ఇళ్లు తమ హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయని, మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవెల్ వరకూ తమ హయాంలోనే కట్టించినవని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించామని, కానీ వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.








